రాజస్థాన్ లోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపురేషన్ చేసారు. ఓ యువకుడి కడుపులో నుంచి 56 బ్లేడ్లు బైటకు తీసారు. షాకింగ్ గా అనిపిస్తుంది కదూ. నమ్మకం కలగక పోయినా ఇది నిజం.
యశ్పాల్ సింగ్.. జాలోర్ జిల్లాలోని సంచోర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతడు బాలాజీ నగర్లో మరో నలుగురు మిత్రులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు.
అతడు నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్గా పనిచేస్తున్నాడు. తీవ్ర కడుపు నొప్పితోబాటు రక్తపు వాంతులయ్యాయి. బాధితుడ్ని ముందుగా దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అతడి పరిస్థితి మరింత విషమించిన కారణంగా.. మరో ఆసుపత్రికి తీసుకువెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో నగరంలోని మెడ్ప్లస్ ఆసుపత్రికి యశ్పాల్ను తరలించారు.
అతడికి ఎక్స్రే సహా మిగతా వైద్య పరీక్షలు చేసిన మెడ్ప్లస్ ఆసుపత్రి డాక్టర్లు.. కడుపులో 56 బ్లేడ్ ముక్కలను గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి.. విజయవంతంగా వాటిని బయటకు తీశారు. దీంతో యువకుడి ప్రాణాలను కాపాడారు.
యువకుడిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతడి ఆక్సిజన్ లెవల్స్ 80 వద్ద ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టమని చెప్పిన వైద్యులు.. విజయవంతంగా చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం యశ్ పాల్ పరిస్థితి బాగానే ఉంది.
అయితే యువకుడి కడుపులోకి ఈ బ్లేడ్లు ఎలా వచ్చాయనేది మాత్రం వైద్యులు వెల్లడించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి వివరాలు చెప్పలేదు.