ఉక్రెయిన్ పై రష్యా వైఖరిని తప్పుబడుతోంది అగ్రరాజ్యం అమెరికా. ముందస్తుగా నిర్ణయించుకునే పుతిన్ యుద్ధానికి దిగారని అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇది తీవ్రమైన విపత్తు, మానవాళి నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జీ-7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇటు యుద్ధ సమయంలోనే రష్యా టూర్ కు వెళ్లిన పాక్ ప్రధానిని టార్గెట్ చేసింది అమెరికా. ఈ యుద్ధంపై పాక్ తన వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజులపాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడం సహా పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.
రష్యా దాడులతో తాను భయపడిపోయానని యూకే ప్రెసిడెంట్ బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పుతిన్ ఉక్రెయిన్ పై అకారణంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు బోరిస్.
మరోవైపు ఉక్రెయిన్ లో శాంతికి అవకాశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గుటెరస్ అన్నారు. ఇప్పటికే అక్కడ చాలా మంది చనిపోయారని.. మానవతా హృదయంతో రష్యన్ దళాలను వెంటనే వెనక్కి పిలవాలని కోరారు.