కరోనా తగ్గినా..ఆ తర్వాత ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని, జాగ్రత్తగా లేకుంటే మాత్రం అది కాస్తా ప్రాణాంతకం అవుతుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.అయితే ఇది కరోనా వచ్చిపోయిన ప్రతి ఒక్కరి విషయంలో మాత్రం కాదు.కరోనా సోకి దీర్ఘకాలం బాధపడ్డ వారికి,రోగ నిరోధక శక్తి బాగా సన్నగిల్లినవారికే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేలింది.ఫ్లోరిడా విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనలో ఇదే విషయానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
కనీసం నాలుగు నుంచి అయిదు వారాల పాటు కోవిడ్ తో బాధపడటం..ఈ మధ్యకాలంలో రకరకాల మందులు,ఇంకా స్టెరాయిడ్లు వాడటంతో సహజంగానే రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటోందని పరిశోధకులు భావిస్తున్నారు.పైగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నరోగుల్లో కనీసం 20 శాతం మంది ఊపిరితిత్తులు బాగా దెబ్బతినటం,శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రం కావటం దీర్ఘకాల దుష్ప్రభావాలకు కారణమవుతోందని తేల్చారు.ఆర్చి మెయినస్ బృందం కనీసం 14 వేల మందిపై నిర్వహించిన పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. అటు..65 ఏళ్లు, ఆ పై వయస్సున్నవాళ్లు మాత్రం,కేవలం కోవిడ్ వల్లనే కాకుండా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా తోడై మృత్యువాతపడుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది.
ఏదిఏమైనా..ఇటీవలి పరిశోధనలన్నీ గమనిస్తుంటే కోవిడ్ ను ఎదుర్కొనటంలో రోగనిరోధక వ్యవస్థ పాత్రే కీలకమని తేలుతోంది.పేషెంట్ వయసుతో సంబంధం లేకుండా..శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టం బాగా ఉండేలా జాగ్రత్త వహించాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.అందుకు తగ్గ ఆహారం తీసుకోవాలని..దాంతోపాటు కోవిడ్ నియమ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించటమే ఈ ముప్పు నుంచి బయటపడటానికి మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ సోకితే…అది రోగనిరోధక వ్యవస్థ మీద ఏ స్థాయిలో దాడి చేస్తుంది..రోగిపై దాని భవిష్యత్ దుష్పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నారు.