శబరిమల దేవాలయంలోకి ప్రవేశించడానికి వచ్చిన ఓ మహిళా హక్కుల కార్యకర్తపై కేరళ లోని కొచ్చిలో గుర్తు తెలియని దుండగుడు పెప్పర్ స్ప్రే తో దాడి చేశాడు. కొచ్చి పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందే ఈ సంఘటన జరిగింది. పెప్పర్ స్ప్రే చల్లుతూ తనపై దాడి చేస్తున్న దుండగుడి నుంచి తప్పించుకునేందుకు బిందు అమ్మని అనే బాధితురాలు పరుగులు పెట్టింది. ఆ తర్వాత దుండగుడు కూడా ఆ పరిసరాల నుంచి పారిపోయాడు. పోలీసులు బిందు అమ్మనిని హాస్పిటల్ కు తరలించి అక్కడి నుంచి అజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారు.
మహారాష్ట్రకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ కూడా ఈరోజు శబరిమల ఆలయ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. దీని కోసం ఆమె ఇప్పటికే కేరళకు చేరుకున్నారు. ఈరోజు ఉదయమే కొచ్చి ఎయిర్ పోర్ట్ లో దిగారు. తృప్తీ దేశాయ్ తో పాటు మరో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. రాజ్యాంగ దినోత్సమైన ఈరోజు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటామని చెప్పారు. ప్రభుత్వం,పోలీసులు రక్షణ కల్పించినా…కల్పించకపోయినా తాము ఆలయ ప్రవేశానికి వెళతామని ప్రకటించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళతానని చెప్పారు.
12 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు కూడా దేవాలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం… సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో కేసును ఏడుగురు సభ్యుల విస్త్రృత ధర్మాసనానికి అప్పగించారు. అయితే విస్త్రృత ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు గతంలో ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
అయినప్పటికీ ఆలయ ప్రవేశానికి వచ్చే మహిళలకు తాము రక్షణ కల్పించలేమని కేరళ ప్రభుత్వం తెలిపింది. వివాదాలకు శబరిమల వేదిక కాదని..12 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఎవరైనా రావాలనుకుంటే వారికి తాము రక్షణ కల్పించమేమని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు.