దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో విద్యార్ధులు, ప్రొఫెసర్లపై దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లోకి ఇనుపరాడ్లు, కర్రలతో ముసుగులు ధరించి వచ్చిన కొందరు బీభత్సం సృష్టించారు. హాస్టల్ ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. హాస్టల్ గదుల్లోని సామాన్లను ధ్వంసం చేశారు. మూడు గంటల పాటు విధ్వంసం సృష్టించారు. వారి దాడిలో 34 మంది విద్యార్ధులు గాయాలపాలై హాస్పిటల్ లో చేరారు. జె.ఎన్.యు విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు తలపై బలమైన గాయాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తమైన ఆమెను వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. దాడి చేసిన వారు ఎవరో కాదని, ఏబీవీపీ గూండాలని యూనివర్సిటీ విద్యార్ధి సంఘం తెలిపింది. విద్యార్ధులపై దాడిని అడ్డుకోబోయిన ప్రొఫెసర్లపై కూడా దాడిచేశారని తెలిపారు. విద్యార్ధులపై దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు, ప్రైవేట్ సెక్యూర్టీ సిబ్బంది అక్కడే ప్రేక్షకుల్లా నిల్చున్నారని బాధిత విద్యార్ధులు పేర్కొన్నారు.దాడి చేసిన వారు వెళ్లి పోవడానికి వారు సహకరించారని చెప్పారు. యూనివర్సిటీ బయట ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పై దాడి జరిగింది. సంఘటన అనంతరం యూనివర్సిటీ క్యాంపస్ లో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. చాలా మంది విద్యార్ధులు క్యాంపస్ వదిలి వెళ్లిపోతున్నారు.
సంఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. సంఘటనపై తమకు పలు ఫిర్యాదులందాయని వాటిపై ఎఫ్.ఐ.ఆర్ చేసి దర్యాప్తు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
దాడి ఘటనపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ ఈరోజు రిజిస్ట్రార్, ప్రొక్డార్, రెక్టార్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్ధులు జె.ఎన్.యు విద్యార్ధులకు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో యూనవర్సిటీ విద్యార్ధులు రాత్రి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గుమికూడారు. విద్యార్ధులపై దాడిని ఖండించారు.