కరీంనగర్ లో దారుణం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాల తయారీదారులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులపై దాడి చేసి నగదుతోపాటు దాచిపెట్టుకున్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు.
కరీంనగర్ కు వలస వచ్చిన కొందరు కార్మికులు.. జ్యోతినగర్ లో గుడిసెలు వేసుకుని గణేష్ విగ్రహాలు తయారు చేశారు. చవితి నేపథ్యంలో విగ్రహాలు అమ్ముడుపోయి భారీ లాభాలు వచ్చాయి. దీంతో ఆ డబ్బుపై కన్నేసిన దుండగులు… కార్మికుల గుడిసెల్లోకి ప్రవేశించి దాడి చేసి నగదు, బంగారం పట్టుకెళ్లారు. పోలీసులకు సమాచారం రావడంతో బాధితులను కలిసి వివరాలు సేకరించారు.
తమ వద్దనున్న రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారని వివరించారు బాధితులు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా గణేష్ నవరాత్రులు పెద్దగా జరగకపోయేసరికి విగ్రహ తయారీదారులు భారీగా నష్టపోయారు. ఇప్పుడేమో మంచి లాభాలు వచ్చాయని సంతోషించే లోపే డబ్బంతా దుండగుల పాలయిందని వాపోతున్నారు.