సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలో వారుండే ఇంటి గేటును ఢీకొట్టి మరీ.. లోపలికి ఓ కారు దూసుకెళ్లింది. కారులో వచ్చిన దుండగులు.. మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులని బెదిరించి తిరిగి అదే కారులో పారిపోయారు. దీంతో వెంటనే వారు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. AP 31 AN 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు వారు పోలీసులకు వివరించారు.
కారులో నలుగురు వ్యక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఘటన సమయంలో సెక్యూరిటీ అప్రమత్తంగా లేనట్టు తెలిసింది. అయితే మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత శత్రువులు వారికి ఎవరు ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆకతాయిలు ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక నిజంగానే మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఇందుకు తెగించారా అన్న కోణంలో విచారిస్తున్నారు.