(శివ క్రాంతి)
మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ భారీ బడ్జెట్ మూవీ ‘సైరా’పై అందరికీ ఎన్నో అంచనాలు వున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అందరి చూపూ అటే వుంది. ఇటీవలే ‘సైరా’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా ఉన్న ఈ మేకింగ్ వీడియో ‘సైరా’ స్టాండర్డ్స్ ఏంటో తెలిసేలా చేసింది. ఆర్ట్ వర్క్, స్టంట్స్, స్టార్ కాస్ట్ ఇంట్రడక్షన్ చూపించిన ఈ వీడియోలోని ఎండ్ ఫ్రేమ్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. మేకింగ్ వీడియోలోని మ్యూజిక్, కెమెరావర్క్ సూపర్బ్‌గా ఉంది.
‘వేర్ మ్యాజిక్ స్టార్ట్.. దేర్ లాజిక్ ఎండ్స్’ అనే మాట ఇండస్ట్రీలో ఉంది. అది అక్షర సత్యమే కానీ.. సైరా విషయంలో మేజిక్-లాజిక్ అనేది కాకుండా ఏకంగా చరణ్-చిరు కలిసి చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన టీజర్‌లో సైరా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఇండియాస్ ఫస్ట్ సివిల్ రెబల్లియన్ వార్ ఫిల్మ్ అంటూ టైటిల్ కార్డు వేశారు. అంటే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన మొదటి వీరుడి కథగా సైరా రాబోతుందని అర్ధం. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందు ఉద్యమాలు చేసిన వాళ్లు లేరా? ఆయనే మొదటిసారి తెల్లదొరలపై పోరాటం చేశాడా అంటే… చరిత్ర నుంచి కాదనే సమాధానం వినిపిస్తుంది. యస్… 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన తిరుగుబాటు కన్నా ముందు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఉయ్యాలవాడ కన్నా దశాబ్దాల ముందే స్వాతంత్య్ర ఉద్యమాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. బెంగాల్ మిడ్నపూర్ చువార్ల దగ్గర నుంచి మొదలు పెడితే, చోటా నాగపూర్ ముండా ఆదివాసీలు, తామర్లు, పహాడీ సర్దార్లు, కేరళ మలై బ్రాహ్మణులు, కొక్కియర్లు, రాంచి కోల్ తిరుగుబాటు, పాట్నా ఖంద్ రివొల్యూషన్, ఒడిశ్శా గోండుల తురుగుబాటు, అస్సాం కాశీల తిరుగుబాటు, బెంగాల్ పగల్-పంత్ తిరుగుబాటు, భిల్లులు, కచ్ తిరుగుబాటు, వాఘేరా తిరుగుబాట్లు, కాశ్మీర్ పండిట్ల పోరాటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా ఉద్యమాలు, నేలకొరిగిన వీరుల కథలే ఉన్నాయి. వీరిలో నాలుగేళ్ల పాటు తెల్లదొరలతో పోరాటం చేసి 33ఏళ్లకే వీరమరణం పొందిన టిరోట్ సింగ్ ఉన్నాడు, వీరనారి రాణి వేలు నాచియర్ ఉంది, జగన్నాధ గజపతి నారాయణ్ ఉన్నాడు, వీర పాండ్య కట్టబొమ్మన్ ఉన్నాడు, మరదు సోదరులున్నారు, మరుదనాయగం కూడా ఉన్నాడు. ఈ మరుదనాయగం కథతోనే కమల్ హాసన్ ఒక సినిమా కూడా ప్లాన్ చేశాడు. క్వీన్ ఎలిజబెత్ 2 వచ్చి లాంచ్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ ఇండియన్ మూవీగా చరిత్రకెక్కింది. కాకపోతే అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ఇలా దేశం కోసం జరిగిన పోరాటం చూస్తే చరిత్ర నిండా నేలకొరిగిన వీరుల కథలే ఉన్నాయి అంతేకాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాత్రమే స్వాతంత్య్ర ఉద్యమం మొదలుపెట్టలేదు.
పోనీ సైరా చిత్ర యూనిట్ చెప్తున్నట్లు ఉయ్యాలవాడ చేసింది మొదటి సివిల్ తిరుగుబాటా అంటే అది కూడా కాదు. కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సామాన్య మనిషేం కాదు. నరసింహారెడ్డి ఒక పాలెగాడు. తనకి రావాల్సిన భరణం ఇవ్వకుండా బ్రిటిషర్లు అతన్నీ, అతని మనుషులని అవమానపరిస్తే, అప్పుడు 1846లో 5000 మందితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం మొదలైన ఏడాదికే అంటే 1847లోనే బ్రిటిషర్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకొని కోవెలకుంట్ల కోటికి ఉరివేసి చంపేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తక్కువనో, దేశం కోసం ఆయనేమి చేయలేదనో చెప్పట్లేదు. ఆయన నిజంగా గొప్ప వీరుడు. తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు. కేవలం ఏడాది వ్యవధిలో ఆయన చేసిన పోరాటానికి భయపడి, మరో ఉయ్యాలవాడ లాంటి వ్యక్తి జనం నుంచి రాకూడదని ముప్పై ఏళ్ల పాటు ఆయన తలని ఒక కోట గోడకి వేలాడదీశారు. దాన్నిబట్టే బ్రిటిషర్లని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత వణికించాడో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే స్వాతంత్య్ర పోరాటం గురించి భారతీయులు మాట్లాడుకున్నన్ని రోజులు ఈ రేనాటి సూర్యుడి కథ చెప్పుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు, అయితే సినిమా కోసం, సినిమాటిక్ లిబర్టీ పేరుతో చరిత్ర మార్చడం… డబ్బులు సంపాదించడం కోసం ఫస్ట్ సివిల్ రెబల్లియన్ వార్ స్టోరీ అనే విధంగా ఈ సైరా సినిమాని ప్రమోట్ చేయడం మాత్రం చాలా తప్పు. అసలు హిస్టరీ అనే మాటకి వస్తే 1857లో సిపాయి తిరుగుబాటే చరిత్రలో అతిపెద్ద సివిల్ రెబల్లియన్ వార్.. ఇది చరిత్ర చెప్తున్న నిజం. సినిమా కోసం చరిత్రని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప వీరుడు. ఆయన కథని అలానే చెప్పండి. అంతే కానీ సినిమా కోసం స్వాతంత్య్ర పోరాటం మొదలుపెట్టిందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనో.. లేక ఆయన తప్ప ఇంకెవరూ పోరాడలేదనో మాత్రం చెప్పకపోవడం మంచిది.