శ్రీలంకలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ లోని అధికారులు సంచలన హెచ్చరికలు చేశారు. ప్రజలను ఆకర్షించేందుకు పలు రాష్ట్రాలు ప్రకటించిన పథకాలతో త్వరలో శ్రీలంక తరహా సంక్షోభం దేశంలో రానుందని వారు హెచ్చరించారు.
సీనియర్ బ్యూరోక్రాట్స్ తో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. పలు రాష్ట్రాలు ప్రకటించిన పథకాలపై ఆ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా ఆ పథకాలు ఆయా రాష్ట్రాలకు సరిపోవని, ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అధికారులతో ప్రధాని శనివారం తన కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, అన్ని శాఖల సెక్రటరీలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ పథకాలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, పథకాల్లో ఏవైనా లోపాలు ఉంటే తనకు వివరించాలని అన్ని శాఖల సెక్రటరీలను ఆయన కోరారు. తమ శాఖకు సంబంధించని పథకాలపైనా కూడా సూచనలు చేయవచ్చని వారికి మోడీ తెలిపారు.
ఈ క్రమంలో మొత్తం 12 మంది కార్యదర్శులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలు ఆర్థిక పరంగా చాలా నష్టం కలిగిస్తాయని, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమలు చేస్తు్న్నాయని, అవి ఆర్థికంగా నిలబడలేవని అన్నారు.