ఏది తప్పో, ఏది ఒప్పో ఈ ప్రపంచానికి పాకిస్తాన్ నీతులు చెబుతోందని, కానీ మొదట మీ దేశంలోని ప్రజాస్వామ్యానికి మీరు తెస్తున్న ముప్పును గ్రహించాలని పాకిస్తాన్ కు ఇండియా హితబోధ చేసింది. మీ ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులను తోసిపుచ్చుతూ మీరు చేస్తున్న నిర్వాకం ఏమిటో ప్రపంచ దేశాలకు తెలుసునని తీవ్రంగా వ్యాఖ్యానించింది. మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో భారత ప్రతినిధి జగ్ ప్రీత్ కౌర్.. పాకిస్తాన్ ను ఉతికి ఆరేసినంత పని చేశారు.
ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.. కానీ ఆ దేశంలోనే వీటిని యధేచ్చగా అతిక్రమిస్తున్నారు. ప్రశ్నించినవారిని అణగదొక్కుతున్నారు.. అందువల్ల పాక్ మొదట తన దేశంలోని పరిస్థితుల గురించి ఆలోచించడం మంచిది’ అని ఆమె అన్నారు. ఉగ్రవాద బృందాలను పెంచి పోషిస్తున్నది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. ఆఫ్ఘానిస్తాన్ లో టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తూ వారిని ఇండియాపైకి ఉసిగొల్పుతున్నారన్నారు.
పాక్ లో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు తదితరులను బ్లాస్ ఫెమీ చట్టాల కింద టార్గెట్ చేస్తున్నారు.. దైవ దూషణకు పాల్పడుతున్నారనే సాకుతో వారిపై దాడులు చేస్తున్నారు అని కౌర్ దుయ్యబట్టారు. ‘ఆక్రమిత’ జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన ఆరోపణను ఐరాసలో భారత శాశ్వత రాయబారి రుచిరా కాంభోజ్ తీవ్రంగా ఖండించారు. ..ఇలాంటి తప్పుడు ప్రచారంపై స్పందించడం కూడా సబబు కాదని తమ దేశం భావిస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు ఎప్పుడూ భారత అంతర్భాగంలోనివేనని, ఇది నిర్వివాదాంశమని ఆమె స్పష్టం చేశారు. బిలావల్ భుట్టో చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశపూరితమైనవని ఆమె ఖండించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలు, శాంతి, సెక్యూరిటీ అనే అంశాలపై ఐరాస భద్రతామండలి నిర్వహించిన బహిరంగ చర్చలో పాల్గొన్న ఆమె.. పాకిస్తాన్ తీరును తీవ్ర స్థాయిన ఎండగట్టారు. పాక్ తో సహా తన పొరుగు దేశాలతో మైత్రీపూర్వక సంబంధాలనే ఇండియా కోరుతోందన్నారు.