చట్టాలు ఎంత కఠినతరం చేసిన నేరస్థులు నేరాలు చేయటం మానటం లేదు. హాయిగా నేరాలకు పాల్పడి దర్జాగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తనదైనా స్టైల్‌లో నేరస్థులపై ఉక్కుపాదం మోపుతుంది. నేరుగా నేరస్థులే వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయే విధంగా ప్లాన్ చేసింది యోగి ప్రభుత్వం.
ప్రసుత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోజర్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్నికల సమయంలో బుల్డోజర్‌కు ప్రాచుర్యం తీసుకొచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు ‘బుల్డోజర్ బాబా’గా తనదైన పంథాలో నేరస్థుల పీఛమణుస్తున్నారు. దీంతో బుల్డోజర్ అనేది బీజేపీ ఐకాన్‌గా మారిపోయింది. బుల్డోజర్లతో నేరగాళ్ల పనిపడుతున్న యోగి దెబ్బకు.. తాజాగా ఓ రేపిస్ట్ గత్యంతరం లేక పోలీసులకు లొంగిపోయాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడ్ని బుల్డోజర్ సాయంతో పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్ ప్రతాప్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడ్ని పట్టుకోడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఓ బుల్డోజర్‌తో నిందితుడి ఇంటికి చేరుకున్నారు. ముందుగా అతడి ఇంటి ప్రహరీ గోడను కూల్చేశారు. అప్పటికీ నిందితుడు లొంగిపోకపోతే ఇంటిని కూల్చేస్తామని హెచ్చరించారు.
దీంతో భయపడిపోయిన నిందితుడు మరోమార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చడానికే కాదు.. నేరస్థులను పట్టుకునేందుకు కూడా బుల్డోజర్లు ఉపయోగపడుతున్నాయంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.