దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సీఎం పదవికి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 25 న సీఎంతోపాటు.. నూతన మంత్రి వర్గంలోని పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అందులో భాగంగానే లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇకానా మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 75వేల సీటింగ్ కెపాసిటీని సిద్ధం చేస్తున్నట్టు అడిషనల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ సెహ్‌గల్ వెల్లడించారు. చీఫ్ సెక్రెటరీ డీఎస్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు ఆయన వెల్లడించారు.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.
కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్ హోదా మంత్రులు ఉంటారని.. దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర, సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంతో వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకుంది. మొత్తం 403 స్థానాలకు.. బీజేపీ 255 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది.