ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అనే సామెత తెలుగు ప్రజల నానుడి. కొడుకు ఎంత గొప్పవాడు అయినా.. తల్లికి చిన్న పిల్లవాడిలాగే కనిపిస్తుంటారు. కొంత కాలం కనిపించని కొడుకు ఒక్క సారిగా కనిపిస్తే ఆ తల్లి కళ్లలో ఆనందానికి అవధులుండవు. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల తర్వాత తన తల్లిని కలిశారు. ఆయనను చూసిన ఆ తల్లి కళ్లలో కూడా అలాంటి ఆనందమే కనిపించింది.
చాలా కాలం తర్వాత అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్న యోగీ.. సంతోషంతో పొంగిపోయారు. యూపీకి సీఎం అయిన తర్వాత ఆయన తన తల్లిని కలవడం ఇదే తొలిసారి. అయితే.. తాజాగా ఉత్తరాఖండ్ లోని తన సొంత గ్రామం పౌరీ వెళ్లిన ఆయన తన తల్లిని కలిశారు. యోగి మేనల్లుడికి పుట్టు వెంట్రుకల వేడుక సందర్భంగా సుమారు 28 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆయన తన సొంతూరులో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అమ్మ పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు యోగీ. అందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ గా మారింది. ప్రధాని మోడీ మాదిరే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కుటుంబానికి దూరంగా ఉంటూ.. రాష్ట్రం ప్రజలకే జీవితం అంకితం చేశారంటు కామెంట్లు పెడుతున్నారు.
కరోనా సమయంలో 2020 ఏప్రిల్ లో కన్నతండ్రి అంత్యక్రియలకు సైతం యోగి వెళ్లకపోవడం గమనార్హం. అయితే.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రజలందరికీ తండ్రిగా కోవిడ్ నిబంధనల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తానే.. వాటిని ఉల్లంఘిస్తే ఎలా? అంటూ ఆయన ఆ సందర్భంలో విమర్శకులను ప్రశ్నించారు.