గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు శీతాకాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈసారి గతంలో ఎన్నడూ లేనంత దూకుడును ప్రదర్శిస్తుంది. కేంద్రమంత్రులంతా ప్రచారానికి వస్తుండగా… శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ రానున్నారు. యూపీ సీఎం ఓల్డ్ సిటీలో ప్రచారం నిర్వహిస్తుండటంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ప్రధాని మోడీ వచ్చి దమ్ముంటే ఓల్డ్ సిటీలో ప్రచారం చేయాలని ఎంఐఎం అధినేత ఓవైసీ సవాల్ చేయటం, మరోవైపు హైదరాబాద్ లో మత ఘర్షణలకు కుట్ర పన్నారంటూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓల్డ్ సిటీకి రాబోతున్నారు.
మద్యాహ్నాం 2గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న యోగి… 3గంటలకు జీడిమెట్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి లో మరో రోడ్ షోలో పాల్గొని, సాయంత్రం ఆరు గంటల తర్వాత శాలిబండ అల్క థియేటర్ వద్ద ప్రచారం చేయనున్నారు. ఈ ప్రాంతం చాలా సున్నితమైంది కావటంతో యోగి ఎవర్ని టార్గెట్ చేసి మాట్లాడుతారో, ఆయన స్పీచ్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి, భయం నెలకొన్నాయి. ఓవైసీ టార్గెట్ గా… ప్రధాని మోడీపై చేసిన ఛాలెంజ్ ను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ ఇప్పటికే లేవనెత్తిన రోహింగ్యాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన ఎలా సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.