ప్రాణాంతక కరోనా వైరస్ కు కేంద్ర బింధువైన చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 25 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ తో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తమను ఇండియాకు తీసుకెళ్లమని భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.
ఆశిష్ యాదవ్ వుహాన్ లోని టెక్స్ టైల్స్ యూనివర్సిటీలో అసోషియేట్ ప్రొఫెసర్. ఆయన భార్య నేహా పి.హెచ్.డి స్కాలర్. ఈ నెల మొదటి వారంలో వుహాన్ లోని భారతీయులను తరలించడానికి ఇండియా ప్రత్యేక విమానాలను పంపినప్పటికీ నేహాకు సర్జరీ కారణంగా వారు అప్పుడు రాలేకపోయారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితిపై భయకంపితులవుతున్న వారు ఇండియాకు తీసుకెళ్లమంటూ భారత ప్రభుత్వానికి వీడియో మెసేజ్ లో మొర పెట్టుకున్నారు. మా పేరెంట్స్ మా గురించి ఆందోళన చెందుతున్నారు… సాధ్యమైనంత త్వరగా ఇండియాకు తీసుకెళ్లమని కోరారు. వుహాన్ నగరం దాదాపు ఎడారిగా ఉంది… దయ్యాల నగరంగా మారింది. ఎవరూ లేరు…నిత్యం వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలతో కళకళ లాడే యూనివర్సిటీ ఖాళీ అయ్యింది. మా అపార్ట్ మెంట్ లో మేమ తప్ప ఎవరూ లేరు..నిత్యావసర సరుకులు లేవు.. మంచి నీళ్లు కూడా లేవు.. నీళ్లు కావాలని అభ్యర్ధిస్తే ఈరోజే కొన్ని నీళ్లు ఇచ్చి పోయారంటూ ఖాళీ బాటిల్స్ ను, ఖాళీగా ఉన్న ఫ్రిజ్ ను వీడియోలో చూపించారు.
ఈ వారం తర్వాత వుహాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానం పంపిస్తామని… అందులో రావాలనుకునే భారతీయులు తమతో టచ్ లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ పెట్టింది. ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది భారతీయులను వుహాన్ నగరం నుంచి భారత్ తీసుకొచ్చారు.