ఆ నలుగురు ఫ్రెండ్స్. బీఎండబ్ల్యూ కారులో బిహార్ నుంచి ఢిల్లీకి బయలు దేరారు. అసలే కుర్రాళ్లు… ఆపై బీఎండబ్ల్యూ.. ఇంకే ముంది ఎక్స్ లెటర్ పై కాలు పెట్టి ఒక్క తొక్కుడు తొక్కారు. కారు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయింది. ఇంతలో పక్కనే ఉన్న స్నేహితుడొకరు ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు.
కారు ఇప్పుడే 230 కిమీ వేగాన్ని అందుకుందంటూ లైవ్ కామెంటరీ మొదలు పెట్టాడు. కొద్ది క్షణాల్లోనే కారు 250 కిమీ వేగం దాటింది. మరి కొద్ది క్షణాల్లోనే కారు 300 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది చూడండి అంటూ చెప్పాడు. ఇంతలో పక్కనే ఉన్న స్నేహితుడు మధ్యలో కల్పించుకుని మాట్లాడాడు.
కారు ఇలానే వేగంగా వెళ్తే ఇక నలుగురు చనిపోవడం ఖాయమంటూ అతడు అన్నాడు. ఇంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. బాగా వేగంగా వెళుతుండటంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని ఆ నలుగురు స్నేహితులు మరణించారు.
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరగడానికి ముందు ఫేస్ బుక్ లైవ్ పెట్టడంతో కారు అత్యంత వేగంతో వెళ్లినట్టు తెలుస్తోంది. కారును డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ అనే వ్యక్తి నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆయన బీహార్ రోహ్‌తాస్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ కారులో అతనితో పాటు స్నేహితులు దీపక్ కుమార్ (ఇంజనీర్), అఖిలేశ్ సింగ్ (రియల్టర్), ముఖేష్ (వ్యాపారి) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.