ఉత్తరప్రదేశ్ లో ని రాంపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ధ్వంసం చేసిన ప్రజా ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ 28 మందికి జిల్లా అధికారులు నోటీసులు అందజేశారు. వారం రోజుల క్రితం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ సంఘటనలో పలు ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయి. వాటికి నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా అధికారులు 28 మందికి నోటీసులు ఇచ్చారు. వాటి విలువ రూ.14 కోట్ల 86 లక్షలు. ఆస్తులను ధ్వంసం చేసే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ ప్రకటించిన నాలుగైదు రోజుల్లోనే అధికారులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల హెల్మెట్స్, లాఠీలు, పెల్లెట్స్ కు అయిన ఖర్చులను కూడా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో గత వారం హింసాత్మక సంఘటనలు జరిగిన వాటిలో రాంపూర్ ఒకటి. పోలీసులుపై నిరసనకారుల రాళ్ల దాడి..బారీ కేడ్ల తొలగింపుతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం కాల్పులు జరిపారు.కాల్పల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారనే కారణంతో ఇప్పటి వరకు 31 మందిని అరెస్ట్ చేశారు. మరో 150 మంది ఉన్నట్టు గుర్తించారు.
ముజఫర్ నగర్ లో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారి 60 షాపులను పోలీసులు సీజ్ చేశారు. ఈ షాపులను వేలం వేసి నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా వారిని గుర్తించామన్నారు.