ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్ గా తాగేసి చనిపోయిన పాముతో హాస్పిటల్ కు వెళ్లి.. వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఖురీనగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పద్రౌనా లో ఉండే సలావుద్దీన్ మన్సూరి అనే వ్యక్తి.. చనిపోయిన ఓ నాగుపాముతో ఆసుపత్రిలోని ఐసీయూలోకి వెళ్లాడు.
దాంతో అక్కడి వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ పాముతో వెళ్లిన సలావుద్దీన్.. తనను కాటు వేయడంతోనే అది చనిపోయిందని డాక్టర్లకు చెప్పాడు. ఆ పాము తన పాదాలు, చేతిపై రెండుసార్లు కాటు వేసిందని తర్వాత చనిపోయిందని వెల్లడించాడు. ఆ పాము దాదాపు మూడు అడుగులు ఉంది. దానిని ఓ పాలిథిన్ కవర్‌లో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు.
తనను పాము కాటేసిందని.. చికిత్స చేయడానికి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇవ్వాలని మన్సూరి వైద్యులను కోరాడు.అయితే డాక్టర్లకు అర్థం కాక… అసలు జరిగిన విషయమేమిటో స్పష్టంగా చెప్పమన్నారు. దాంతో అసలు విషయం తెలిసింది. తాను పద్రౌనా రైల్వే స్టేషన్ మీదుగా ఇంటికి వెళ్తున్నానని.. ఆ సమయంలో తాను మత్తులో ఉన్నానని మన్సూరి తెలిపాడు.
ఆకస్మాత్తుగా తనకు నాగుపాము కనిపించిందని, దాంతో తను పట్టాలపై ఉండిపోయాయని, కదల్లేకపోయానని చెప్పాడు. దాంతో ఆ పాముపై కోపం వచ్చి… తన చేతులతో పామును పట్టుకుని.. పదే పదే కొట్టాడు. ఆ సమయంలో పాము చేతిపై కాటేసిందని చెప్పాడు. కొట్టడంతో ఆ పాము చనిపోయింది.
ప్రస్తుతం ఆ వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.