ఈరోజుల్లో హత్యలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎదిరించిన వారిని చంపేయడం కొంతమందికి ఓ ఫ్యాషన్ లా తయారయ్యింది. ఆస్తుల కోసం చంపుకోవడం చూశాం. ప్రేమించిన అమ్మాయి కోసం చంపుకున్న వాళ్లనూ చూశాం.. కానీ ఇక్కడ ఓ యువకుడు కేవలం పది రూపాయల కోసం హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర్ ప్రదేశ్, సోన్‌భద్రలోని రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అవినాష్ గుప్తా అనే యువకుడు చాట్, కుల్ఫీ దుకాణాన్ని దోరియా గ్రామ సమీపంలో నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దినేశ్ అనే మరో యువకుడు అవినాష్ దుకాణంలో చాట్ తిన్నాడు. డబ్బులు తరువాత ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత దినేశ్ మరో యువకునితో కలిసి వచ్చి మళ్లీ చాట్ కావాలని అడిగాడు.
కానీ చాట్ ఇవ్వడానికి అవినాష్ ఒప్పుకోలేదు. ముందు తిన్న చాట్ కు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన తీవ్ర స్థాయికి చేరుకుంది. అప్పటికి ఆ గొడవ సద్దుమణిగినప్పటికీ.. దుకాణం నుంచి ఇంటికి వచ్చిన అవినాష్ పై మరోసారి దాడికి దిగాడు దినేశ్. గొడవ పెద్దది అయ్యేసరికి కోపం పట్టలేని దినేశ్ పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో అవినాష్ తలపై బలంగా కొట్టాడు. దీంతో అవినాష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో అవినాష్ ప్రాణాలు కోల్పొయాడు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.