ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రికి వింత అనుభవం ఎదురైంది. ఓ ఎలుక చేసిన పనికి ఇటు మంత్రికి, అటు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఇంతకీ ఆ ఎలుక ఏం చేసిందంటే..? యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు. అయితే, అధికారిక కార్యక్రమాల సమయంలో మంత్రులు, అధికారులు ప్రైవేట్ హోటళ్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లలో మాత్రమే సేదతీరాలని ఇటీవల సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో అక్కడ పర్యటన పూర్తిచేసుకున్న మంత్రి రాత్రి బండాలోని ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా నిద్రలేచిన మంత్రి తనను ఏదో విషపురుగు కరిచిందని.. అది పాము కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కార్యకర్తలు, అధికారులకు సమాచారం అందించారు.
ఒక్కసారిగా భయపడిన అధికారులు ఆయనను అప్పటికప్పుడు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరిచింది పాము కాదని.. ఎలుక కొరికిందని నిర్ధారించారు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, మంత్రి బసచేసిన గెస్ట్ హౌస్ చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో తొలుత పాము కరిచి ఉంటుందని మంత్రి భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సిబ్బంది గెస్ట్ హౌస్ అన్ని గదులు గాలించి ఎలుకను పట్టుకున్నారు. ఇక చికిత్స అనంతరం సోమవారం ఉదయం 6 గంటల సమయంలో వైద్యులు మంత్రిని డిశ్చార్జి చేశారు.