గత వారం రోజులుగా యూపీలో జరుగుతున్న నిరసనల్లో హింస చెలరేగి 15 మంది మృతి చెందారు. వారిలో చాలా మంది తుపాకీ బుల్లెట్ గాయాలతోనే చనిపోయారని ప్రతిపక్షాలు, మృతుల కుటుంబాలు చెబుతుండగా…15 మందిలో ఎవరూ కూడా పోలీసు కాల్పుల్లో చనిపోలేదని పోలీసులు చెప్పారు. తాము ఎక్కడ కూడా నిరసనకారులపై ఒక్క బుల్లెట్ ప్రయోగించలేదని స్వయంగా రాష్ట్ర డీజీపీ ప్రకటించారు.
అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టు ఆ జిల్లా పోలీసులు తాజాగా ప్రకటించారు. బిజ్నోర్ లో గత శుక్రవారం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో హింస చెలరేగింది. ఈ సందర్భంగా ఆత్మ రక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో సులేమాన్ అనే 20 ఏళ్ల యువకుడు చనిపోయినట్టు బిజ్నోర్ పోలీసులు తెలిపారు. అయితే రాష్ట్ర డీజీపీ, బిజ్నోర్ పోలీసులు చెబుతున్న దానిలో పొంతన లేకుండా ఉంది.