బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు. బురద నీళ్లతో తల స్నానం చేయించారు. సామాన్యంగా ఎవరి మీదైనా పట్టరాని కోపం వస్తే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడం వంటి పనులు చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోకపోతే ప్రజలు చేసే పనుల్లో ఇలా బురద జల్లడం ఒకటి. కానీ ఇక్కడ బురద జల్లడం మాత్రం సంతోషంతో జరిగింది. అసలు ఈ బురద కథేంటి..? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి..!
ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్‌డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు వాన దేవుడి ప్రసన్నం కోసం పురాతన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా స్థానిక పాలకులకు బురద నీళ్లతో తల స్నానం చేయించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత మహిళలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ల తలపై బురద నీళ్లు గుమ్మరించి మట్టి స్నానం చేయించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ పాటలు పాడారు.
కాగా, పిల్లలు, పెద్దలు బురద నీటితో తల స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత మహిళల నమ్మకమని బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ తెలిపారు. పురాతన సంప్రదాయమైన ఈ బురద స్నానంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏది ఏమైనా ఇలాంటి వింత ఆచారాలు ఇంకా పాటిస్తున్నారా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.