త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, అదే విధంగా కడప- అనంతపురం- కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర పేర్లను అధిష్టానం ఖరారు చేసింది.
శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం స్థానానికి పీవీఎస్ మాధవన్ ను ఎంపిక చేసింది. మిగిలిన స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న, రెండోది.. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సయ్యద్ అమీనుల్ హస్సన్ జాఫ్రీ పదవీకాలం మే ఒకటో తేదీన ముగియనుంది. ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల ఓటర్ల జాబితాను సైతం అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. షాద్ నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేందర్ నగర్, కందుకూరు డివిజన్లలో కలిపి 8,686 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 4,095 మంది, పురుషులు 4,590 మంద, ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు.
మరోవైపు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ శాసన మండలి ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఓటు నమోదు గడవు ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సోమవారం తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు 1,131 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. డిసెంబరులో ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ నియోజక వర్గంలో 29,501 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 23 న ప్రకటిస్తామన్నారు.