అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ దళితులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో వున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ యువకులు కొందరు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్టించాలంటూ ఈ యువకులు తమ నిరసన తెలియజేస్తున్నారు. రోడ్డుపై మంటలు వేసి నిరసన తెలిపారు. వీరి ఆందోళన అమలాపురం, ఉప్పలగుప్తం ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దళిత నాయకులతో ఆర్డీవో, డీఎస్‌పీ జరిపిన చర్చలు విఫలం కావడంతో యువకులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఉప్పలగుప్తం సెంటర్ దగ్గర ఇరు వర్గాలూ భారీగా మోహరించి వున్నాయి. పరిస్థితి ఎప్పుడు అదుపు తప్పుతుందో తెలియని పరిస్థితి. నాలుగు గంటలుగా నలుగురు యువకులు సెల్ టవర్ పైనే ఉన్నారు.