రాజస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్య మంత్రి అశోక్ గెహ్లట్ బడ్జెట్‌ను చదవడం ప్రారంభించారు. అయితే ఆ బడ్జెట్ ఈ ఏడాది కాదని సీఎం గతేడాది బడ్జెట్ ను చదవుతున్నారంటూ బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ సభ్యులు వెల్ లోకి ప్రవేశించి రచ్చ చేశారు. చివరకు మంత్రి మహేశ్ విషయాన్ని గ్రహించి సీఎంకు విషయాన్ని వివరించారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు.
బడ్జెట్ కాపీని తీసుకు రావడంలో అధికారులు హడావుడి చేసిన సమయంలో బడ్జెట్ సాంకేతికంగా లీక్ అయిందని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి తప్ప మరెవరూ బడ్జెట్ కాపీని తీసుకురాకూడదని బీజేపీ పేర్కొంది. కానీ బడ్జెట్ నలుగురైదుగురి చేతుల్లోకి వెళ్లిందని ఛబ్రా ఎమ్మెల్యే, బీజెపికి నేత ప్రతాప్ సింఘ్వి ఆరోపించారు. కొత్త బడ్జెట్ ను తీసుకు రావాలని సీఎంను ఆయన డిమాండ్ చేశారు.
సభ తిరిగి సమావేశమైన వెంటనే బీజేపీ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. ఎలాంటి లీక్ జరగలేదన్నారు. తాజా బడ్జెట్ పత్రాల్లో సూచన కోసం గతేడాది బడ్జెట్ నుంచి అడిషనల్ పేజిని యాడ్ చేశారని చెప్పారు. రాజస్థాన్ అభివృద్ధికి, ప్రగతికి తాము వ్యతిరేకమని బీజేపీ చూపించాలనుకుంటోందని మండిపడ్డారు.