జి. సంపత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్
నల్లమల్ల అడవుల్లో యురేనియం చిచ్చు రగులుతూనే వున్నది. గత రెండేళ్ళక్రితం అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రైవేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. కానీ దాని వల్లవచ్చే లాభాలు, ముడుపుల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వమే యురేనియం తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురికావడమేకాకుండా, అనారోగ్యాల పాలవుతారని తెలిసీకూడా ప్రభుత్వం తవ్వకాలను ప్రారంభిస్తున్నదంటే, ప్రజాక్షేమం వీరికి పట్టదని అర్దమవుతున్నది.
యురేనియం తవ్వకాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని, పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు సామాజిక కార్యకర్తలు చూపించారు. ఈ యురేనియం తవ్వకాలతో అటు వన్యప్రాణులు, ఇటు అడవితల్లి బిడ్డలకు పెద్ద కష్టమొచ్చింది. తెలంగాణ నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు అన్ని ప్రాంతాల ప్రజలు పోరాటం చెయ్యాల్సిందే. మరో వైపు తెలంగాణలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు పోరాటం చేస్తూనే వున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వున్నట్లు గుర్తించారు. దాంతో ప్రైవేట్ కంపెనీలకు బదులు ప్రభుత్వం ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు రెడీ అయ్యింది. నల్లమల్ల అటవీప్రాంతంలో ఆమ్రాబాద్ మండలంలో 18 గ్రామపంచాయతీల్లో యురేనియం తవ్వకాల భయం మొదలైంది. ఇక్కడి అటవీప్రాంతంలో 17 పులులతో పాటు, అనేక వన్య ప్రాణులున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ నగర ప్రజలకు తప్పని తిప్పలు
ఆమ్రాబాద్ అటవీ ప్రాంతం నాగార్జున సాగర్ డ్యాంకు ఆనుకుని వుండటంతో, యురేనియం తవ్వకాలు మొదలైతే, కృష్ణానది కూడా ఆ ప్రభావానికి గురయ్యే ప్రమాదం వుంది. ఒక్కసారి కృష్ణానది జలాలు యురేనియం ప్రభావానికి గురైతే, జంటనగరాల దాహార్తి తీరుస్తున్న కృష్ణానది జలాలు లభ్యత కష్టమవుతుంది. అదే సమయంలో నాగార్జునసాగర్ దిగువన వున్న ప్రాంతాలకు కూడా అపార నష్టం తప్పదని అంచనాలు వస్తున్నాయి. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వజ్రాల తవ్వకాలకు అనుమతులు పొందిన డీబీర్స్ సంస్థ, ఆ ప్రాంతంలోని యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కూడా అనుమతులు పొందేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ మండల పరిధిలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు పోరాటం చెయ్యాల్సిన అవసరం వుంది. గిరిజన పుత్రులకు అపార నష్టం చేకూర్చనున్న యురేనియం తవ్వకాలను నిలిపి వేసేందుకు డిమాండ్ చేయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది.
యురేనియం ప్రభావం అంతా ఇంతా కాదు..
జార్ఖండ్‌లో యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో అంగవైకల్యం, వింత ఆకారాలతో పిల్లలు పుట్టడం, చర్మ సంబంధిత క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్న ప్రజలను ఉదాహరణగా మనం చూడొచ్చు. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే ఇలాంటి దుష్పరిణామాలు భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎదుర్కోవలసి వుంటుంది. యురేనియం బాంబుల దాడులకు గురైన హిరోషిమా, నాగసాకి ప్రాంతాలకు ఇప్పటికీ కోలుకోలేని దుస్థితిలో వున్న సంఘటనలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ నగర జనం నడుం బిగించాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై, అడవి బిడ్డలను కాపాడుకునేందుకు ఉద్యమంలో కలిసిరావాల్సిన అవసరం వుంది. సేవ్ నల్లమల.. సేవ్ తెలంగాణ