అర్బన్ నక్సలైట్లు, అభివృద్ధి వ్యతిరేక శక్తుల వల్లే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యం అవుతోందని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. పర్యావరణానికి హాని కలుగుతుందని సాకులు చెబుతూ తమ రాజకీయ ప్రోద్బలంతో డ్యామ్ నిర్మాణాన్ని వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇప్పటికీ అర్బన్ నక్సల్స్ క్రియాశీలంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి పలు సంస్థల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరిట అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గుజరాత్ నర్మదా జిల్లాలో పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన… పర్యావరణ అనుమతులను పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు సమతుల విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు.
కొందరు వ్యక్తులు సర్దార్ సరోవర్ డ్యామ్‌ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారని తెలిపారు. ప్రపంచ బ్యాంకుతో పాటు న్యాయస్థానాలను కూడా వారు ప్రభావితం చేసి ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆయన అన్నారు. దీంతో భారీగా డబ్బు వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు డ్యామ్ నిర్మాణం పూర్తైందన్నారు. అర్బన్ నక్సల్స్, అభివృద్ధి వ్యతిరేక శక్తుల ఆరోపణలు పూర్తిగా అసత్యాలని ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. పర్యావరణానికి హాని జరుగుతుందని వారు ఆరోపించారని చెప్పారు. కానీ. దానికి భిన్నంగా డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రకృతి ప్రేమికులకు తీర్థక్షేత్రంగా మారిందన్నారు. సులభతర వాణిజ్యం, సులభతర జీవనాన్ని అందించేందుకు చేపట్టే ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులూ ఎదురవ్వకుండా రాష్ట్రాల పర్యావరణ మంత్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పర్యావరణ అనుమతులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనుమతులను త్వరగా మంజూరు చేసినప్పుడే రాజీపడకుండా పనులు చేయడం సాధ్యమవుతుందన్నారు. అనుమతుల మంజూరులో జాప్యం జరిగితే ప్రాజెక్టు వ్యయాలు పెరుగుతాయన్నారు.
వాస్తంగా అక్కడ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచాలన్నారు. ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని మంత్రులకు సూచించారు. పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేస్తే ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణానికీ మేలు జరుగుతుందన్నారు.