ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అర్బన్ నక్సల్స్’ తమ రూపురేఖలను మార్చుకుని గుజరాత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. యువత జీవితాలను నాశనం చేయడానికి వారిని అనుమతించ వద్దని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.
దేశంలోనే తొలి బల్క్ డ్రగ్స్ పార్క్‌కు బరూచ్ జిల్లాలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. అర్భన్ నక్సల్స్ కొత్త అవతారంలో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. వారి రాష్ట్ర యువతను తప్పుదారి పట్టిస్తారని పేర్కొన్నారు.
మన రాష్ట్ర యువతను నాశనం చేసేందుకు వారికి అవకాశం ఇవ్వద్దన్నారు. మన దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న అర్బన్ నక్సల్స్ గురించి మనం మన పిల్లలను హెచ్చరించాలని ఆయన సూచించారు. వారంతా విదేశీ శక్తుల ఏజెంట్లని మండిపడ్డారు.
గుజరాత్ ఎప్పుడూ తన తలను అర్భన్ నక్సల్స్ ముందు వంచబోదన్నారు. వారిని, వారి ప్రణాళిక గుజరాత్ నాశనం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ పదవ స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు అది ఐదవ స్థానానికి చేరిందన్నారు.