బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ మోడల్ ఉర్ఫి జావెద్ ముంబైలోని అంబోలి పోలీసుల ఎదుట ఈ రోజు హాజరయ్యారు. బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు చిత్ర వాఘ్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో ఉర్ఫిజావెద్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
తన వస్త్రధారణపై ఆమె ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన దుస్తులను ధరిస్తానని చెప్పారు. అలా చేయడం నేరమేమి కాదని వెల్లడించారు. తాను ఇండిపెండెంట్ వ్యక్తినని చెప్పారు. తాను షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు ఒక రకమైన డ్రస్సులను ధరిస్తానని వివరించారు.
ఇదేమీ పెద్ద నేరమేమీ కాదన్నారు. అది నేరమని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. షూటింగ్స్ కోసం తాను బయటకు వెళ్లినప్పుడు తనను చాలా మంది ఫాలో అవుతారని పేర్కొన్నారు. చాలా మంది ఫోటోలు తీసుకొని వాటిని వైరల్ చేస్తారని వెల్లడించింది. కానీ ఆ ఫోటోలను తాను వైరల్ చేయనని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజుల నుంచి చిత్ర వాఘ్, ఉర్ఫి జావెద్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. చిత్ర వాఘ్‌పై కూడా మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఉర్ఫి జావెద్ ఫిర్యాదు చేశారు. తనపై చిత్ర వాఘ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల చిత్ర వాఘ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.