గత నవంబరు 26 న న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మద్యం మత్తులో మూత్రం పోసిన వ్యక్తిని శంకర్ మిశ్రాగా గుర్తించారు. ఈ ఉదంతం తాలూకు తాజా సమాచారానికి సంబంధించి ఆయన తరఫు లాయర్ శుక్రవారం ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తూ.. తన క్లయింటు .. జరిగిన సంఘటన పట్ల ఎంతో చింతించాడని, నవంబరు 28 న బాధిత మహిళ బట్టలు, బ్యాగులు శుభ్రం చేశాడని తెలిపారు. అదేనెల 30 న వాటిని ఆమెకు రిటర్న్ పంపాడన్నారు.
పైగా డిసెంబరు 20 న ఆమె ఫిర్యాదును పురస్కరించుకుని ఎయిరిండియా ఎయిర్ లైన్స్ ఆమెకు పరిహారం చెల్లించిందన్నారు.అలాగే తన క్లయింటుకి, బాధితురాలికి మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం ఆయన కూడా ఆమెకు పరిహారం చెల్లించినట్టు ఇషానీ శర్మ అనే ఈ లాయర్ చెప్పారు. అయితే డిసెంబరు 19 న బాధిత మహిళ కూతురు ఆ పరిహారాన్ని తిప్పి పంపేసిందన్నారు.
ఎయిరిండియా కేబిన్ సిబ్బంది నియమించిన ఎంక్వయిరీ కమిటీ ముందు ఈ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని ఈ కమిటీకి తెలిసింది.శంకర్ మిశ్రాకు ఈ దేశ చట్టం మీద ఎంతో విశ్వాసం ఉందని, ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని ఆ లాయర్ పేర్కొన్నారు.
ముంబైలో నివాసం ఉంటున్న శంకర్ మిశ్రా.. బిజినెస్ మన్ అని, జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బాధిత మహిళను కోరాడని తెలిసింది. ఇది తెలిస్తే తన భార్యా పిల్లలు బాధ పడతారని ఆమె వద్ద మొర పెట్టుకున్నాడట. ఎయిరిండియా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఈ విషయాలున్నాయి. కానీ ఎయిరిండియా మాత్రం జనవరి 4 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు పక్షాలూ విషయాన్నీ సెటిల్ చేసుకున్నందువల్ల ఇక పోలీసుల వరకు వెళ్లరాదని ఈ ఎయిర్ లైన్స్ సంస్థ నిర్ణయించింది.