తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు తాను అధిక డోసు గల ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే…..
శక్తివేల్, పూర్ణిమ దంపతులు పదేండ్ల కుమారునితో కలిసి సంపత్ నగర్‌లోని న్యూ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈరోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శక్తివేల్ యూరాలజిస్టుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం అతని భార్య పూర్ణిమ అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తోంది.
ఈ క్రమంలో నిన్న ఇంటి నుంచి శక్తివేల్ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పక్కింటి వారు అతని ఇంట్లోకి వెళ్లి చూశారు. కానీ అప్పటికే శక్తివేల్ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. పక్కనే మత్తు మందు ఇంజెక్షన్‌ను వారు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే శక్తివేల్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శక్తివేల్ మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. శక్తివేల్ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ తీసుకుని శక్తివేల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
మరోవైపు కర్ణాటకలోని దార్వాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. 30 ఏండ్లు నిండినా ఇంకా వివాహం కావడం లేదని సంతోష్ కోరడి అనే యువకుడు మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శ్మశాన వాటికలో ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.