నటి, మోడల్ ఊర్వశి రౌతేలాకు కోపం వచ్చింది. క్రికెటర్ రిషబ్ పంత్ ని వెంటాడుతూ ఆస్ట్రేలియా వచ్చానని నెటిజనులు తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారన్న ”ఆవేదన’ ఒకటికాగా ఇరాన్ లో మొహసా అమీని మాదిరే తన పరిస్థితి కూడా ఉందంటూ తన జుట్టును ఆమె కత్తిరించుకుంది. ఆ దేశంలో ఇస్లాం కట్టుబాట్లను ఉల్లంఘించిందంటూ మొహసా అమెనీని పోలీసులు హతమార్చారు. ఇది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు తమ జుట్టు కత్తిరించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లర్లు, ఘర్షణల్లో పలువురు మరణించారు.
ఇప్పుడు ఆ పరిస్థితిని ఊర్వశి రౌతేలా గుర్తు చేస్తూ.. తాను కూడా మోహాసా అమీనీ వంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని వాపోయింది. మహిళలు తమ హక్కుల కోసం పోరాడితే తప్పా అంటూ తాను జుట్టును కత్తిరించుకుంటున్న ఫోటోను తన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంతేకాదు.. ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో 19 ఏళ్ళ అంకిత భండారీ హత్య కేసును కూడా ఆమె ప్రస్తావించింది.
ఇలా బాలికలు,యువతులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వారికి గౌరవం దక్కడంలేదని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు వారి జుట్టే అందమని, కానీ ఈ సమాజం చూపుతున్న వైఖరికి నిరసనగా వారు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని తెలిపింది.
‘ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను.. అయితే రిషభ్ పంత్ ఇక్కడికి వచినందునే నేను కూడా వచ్చానంటూ నెటిజన్లు ట్విటర్లలో నన్ను దారుణంగా వేధిస్తూ మానసిక క్షోభ పెడుతున్నారు.. దయచేసి వాళ్ళు ఈ ట్రోలింగ్ మానాలి’ అని ఊర్వశి రౌతేలా విజ్ఞప్తి చేసింది. మొదట ఇరాన్ లో మోహాసా అమీనీ.. ఇప్పుడు ఇండియాలో నాకు ఇలా జరుగుతోంది.. నాకు ఎవరూ సాయపడడం లేదు.. మద్దతునివ్వడం లేదు అని ఆమె మరో వీడియోలో వాపోయింది. రిషబ్ పంత్, ఊర్వశి లవ్ బర్డ్స్ అని గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి.