అగ్రరాజ్యం అమెరికాతో చైనాకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే వాణిజ్య యుద్దం నడుస్తోంది. ఇక ఇండో-ఫసిపిక్ ప్రాంతంలో చైనా దూకుడు, తైవాన్ విషయంలో చైనాపై విధానం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీపై గుర్రుగా ఉంది. ఈ క్రమంలో అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రెండేండ్లలో చైనా-అమెరికాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టు యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మైఖేల్ మినిహాన్ అన్నారు. ఈ మేరకు సైనిక సిబ్బందికి ఆయన లేఖ రాశారు. తైవాన్‌లోకి ఇటీవల చైనా చొరబాట్లు ఎక్కువయ్యాయి. దీంతో యూఎస్ వైమానిక దళం నుంచి హెచ్చరిక వచ్చింది.
2025లో డ్రాగన్ కంట్రీతో యుద్ధం చేయాల్సి వస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అందు వల్ల అందరూ సిద్ధంగా ఉండాలని లేఖలో ఆయన సైనికులకు సూచించారు. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అవసరమైతే దాన్ని ఓడించడమే అమెరికా ప్రధాన లక్ష్యమన్నారు.
ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇది వివాదాస్పదం అయింది. ఈ క్రమంలో సీనియర్ సైనిక అధికారులు స్పందించారు. అమెరికా, తైవాన్‌లో 2024లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ సమయంలో తైవాన్‌పై దాడికి చైనా తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తుందని లేఖలో వెల్లడించారు.