కరోనా టెస్ట్ రిజల్ట్ కోసం రోజులు, గంటల తరబడి వేచి చూసే అవసరం లేకుండా ఉండేందుకు అమెరికాకు చెందిన ఓ లేబరేటరీ కొత్త
పోర్టబుల్ టెస్ట్ కిట్ ను విడుదల చేసింది. అబ్బోట్ లేబరేటరీస్ తయారు చేసిన ఈ 5 నిమిషాల పోర్టబుల్ టెస్ట్ కిట్లను పరీక్షించిన అనంతరం అమెరికా పుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ పరికరాల తయారీకి అనుమతి నిచ్చింది. ఆ కిట్లు వచ్చే వారం వరకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది.
చిన్న టోస్టర్ మాదిరిగా ఉండే ఈ పరికరం మాలిక్యూలర్ టెక్నాలజీని వినియోగిస్తుంది. నెగిటివ్ రిజల్ట్స్ ను 13 నిమిషాల్లో చూపిస్తుందని కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ”కొవిడ్-19 వైరస్ తో పలు రకాలుగా పోరాటం చేయాలి.. పోర్టబుల్ మాలిక్యూలర్ టెస్ట్ వైరస్ ను 5 నిమిషాల్లో గుర్తించడం వల్ల చికిత్సను వెంటనే ప్రారంభించవచ్చు” అని అబ్బోట్ లేబరేటరీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాబర్ట్ ఫోర్డ్ తెలిపారు.
చిన్నగా, ఎక్కడి కంటే అక్కడికి తీసుకెళ్లే ఈ పరికరంతో హాస్పిటల్లో నాలుగు గోడల మధ్య చేసే టెస్ట్ పద్ధతికి చెక్ పెట్టి వైరస్ ప్రభావం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి టెస్ట్ చేయడానికి వీలుంటుంది…అమెరికా పుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి వైరస్ కేంద్ర బింధువుగా ఉన్న ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నామని రాబర్ట్ ఫోర్డ్ వెల్లడించారు.