ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పై కలిసి పోరాటం చేయాలని చైనా-అమెరికా దేశాలునిర్ణయించాయి. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కాల్ చేసి మాట్లాడినట్టు చైనా అధికారిక మీడియా తెలియజేసింది.
కరోనా వైరస్ తీవ్రతపై ముందస్తు సమాచారం ఇవ్వలేదనే కారణంతో చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాధినేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రెండు దేశాలు ఇప్పుడు అవన్నీ మర్చి వైరస్ పై సంయుక్త పోరాటానికి సిద్దమయ్యాయి. వైరస్ కు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం…దాన్ని కట్టడి చేయడంలో చైనా అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తెలియజేసినట్టు చైనా మీడియా తెలిపింది.
ఇరు దేశాధినేతలు గతాన్ని మర్చి శుక్రవారం కొంత రాజీ దోరణితో మాట్లాడుకున్నట్టు కనిపిస్తుంది. ఇంతకు ముందు ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తరచుగా కొవిడ్-19 వైరస్ ప్రస్తావన వచ్చినప్పడల్లా ఆ పదం వాడకుండా దానికి బదులుగా ”చైనా వైరస్’ అనే వారు. దానికి బదులుగా చైనా విదేశాంగా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కూడా స్పందిస్తూ…అమెరికా మిలిట్రీ ద్వారానే వైరస్ వుహాన్ కు వచ్చిందని అన్నారు.
వైరస్ పుట్టిన చైనా కంటే కూడా అమెరికాలో దాని బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అర్ధిక వ్యవస్థ కలిగిన అమెరికాలో ఇప్పటి వరకు 82,400 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇరు దేశాలు కలిసి పనిచేయక తప్పని పరిస్థితి. చైనా-అమెరికా సంబంధాలు కీలక దశలో ఉన్నాయి. పరస్పర సహకారం వల్ల ఇరువురికి లాభమే…”ఇదే సరైన ఏకైక అవకాశం” అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నట్టు చైనా అధికారిక మీడియా సీసీటీవీ తెలిపింది.
”చైనా-అమెరికా సంబంధాలను పెంపొందించడంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను…ప్రాణాంతక వైరస్ పై పోరాడడానికి ఇరుదేశాల మధ్య సహకారం బలోపేతం చేసుకోవాలి ” అని జిన్ పింగ్ అన్నారు. అమెరికాకు సహకరించడంలో భాగంగా చైనాలోని కొన్నికంపెనీలు అమెరికాకు వైద్య సహాయాన్ని అందిస్తాయని జిన్ పింగ్ తెలిపారు.