లండన్-ముంబై ఎయిరిండియా విమానంలో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. అమెరికాలో నివసించే 37 ఏళ్ళ రమాకాంత్ అనే ఈ వ్యక్తి ఈ విమానంలో ని వాష్ రూమ్ లో సిగరెట్ తాగుతూ, ఇతర ప్రయాణికులతో గొడవ పడుతూ పట్టుబడ్డాడు. పైగా విమానం డోర్ ను ఓపెన్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. మద్యం తాగిన మత్తులో రమాకాంత్ ఇలా అసభ్య చేష్టలకు పాల్పడినట్టు తెలుస్తోంది. లేదా ఇతనికి మతి భ్రమించి కూడా ఉండవచ్చునని విమాన సిబ్బంది భావించారు.
తన బ్యాగ్ లో బుల్లెట్ ఉందని చెప్పినప్పటికీ అతని లగేజీ తనిఖీ చేయగా అలాంటిదేదీ కనిపించలేదు. సహర్ పోలీసు స్టేషన్ లో ఇతనిపై కేసు నమోదయింది. మద్యం తాగి ఉన్నాడా లేక బుద్ధి మాంద్యంతో అలా ప్రవర్తించాడా అన్నది తెలుసుకునేందుకు ఇతని రక్తం వగైరాల శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు.
ఈ నెల 4 న కూడా కోల్ కతా-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడువాష్ రూమ్ లో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. విమానం ఢిల్లీలో దిగగానే అతడిని పోలీసులకు పట్టించారు. ఇతడిని అనిల్ మీనాగా గుర్తించారు.
విమాన వాష్ రూమ్స్ లో గానీ, విమానంలో గానీ స్మోకింగ్ కి అనుమతి లేదని, కానీ రమాకాంత్ వాష్ రూమ్ లో సిగరెట్ తాగుతుండగా అలారం మోగిందని, తాము వెళ్లి అతని చేతిలోనుంచి దాన్ని తీసి పారవేయగానే పెద్దఎత్తున కేకలు పెట్టడం ప్రారంభించాడని లండన్-ముంబై ఎయిరిండియా విమాన సిబ్బంది తెలిపారు. అడ్డుకోబోయిన ఇతర ప్రయాణికుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడని వారు చెప్పారు. దాంతో సీటుకు అతని కాళ్ళు, చేతులు కట్టివేశామని, తన బ్యాగ్ లో యేవో మందులు ఉన్నాయని అతడు చెప్పడంతో.. దాన్ని తెరిచి చూడగా మందులేవీ కనబడలేదన్నారు. చివరకు విమానం ముంబైలో దిగగానే అతడిని సహర్ పోలీసులకు పట్టించారు.