రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై విరుచుకుపడిన అమెరికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొన్నందుకు భారత్‌పై విధించిన ఆంక్షల విషయంలో మినహాయింపును ఇచ్చేందుకు తాజాగా అమెరికా ప్రతినిధుల సభ అంగీకారం తెలిపింది. ఆమేరకు కాట్సా చట్టాన్ని సవరించేందుకు భారత సంతతికి చెందిన రో ఖన్నా అమెరికన్ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుద్వారా కాంగ్రెస్ దిగువ సభ బిల్లును ఆమోదించింది.
కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది.
చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది. ఈ తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఆయన తెలిపారు. దీంతో భారత్ – అమెరికా సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని తెలిపారు.
గతంలోనే అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భారత ప్రభుత్వం 2018లో రష్యా నుంచి రూ.40 వేల కోట్ల విలువైన ఐదు ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.