కరోనా వైరస్ నివారణ కోసం రూపొందించిన ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్న దేశాల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ టీకాకు అమెరికా కూడా అనుమతి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు చెందిన నిపుణుల కమిటీ వ్యాక్సిన్‌ను పరిశీలించిన ఓకే చెప్పింది. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో 17 మంది అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు మాత్రమే వ్యతిరేకించారు. దీంతో అమెరికాలోనూ ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఫైజర్ వ్యాక్సిన్‌తో 16 ఏళ్లు దాటిన వారిలో ఎటువంటి ఇబ్బందులు కలగలేదని ఎఫ్‌డీఏ నిపుణులు గుర్తించారు. కాగా ఈ టీకాకు బ్రిటన్, కెనడా, బహ్రాయిన్, సౌదీ అరేబియాలోనూ ఆమోదం దక్కింది. ఇప్పటికే పంపిణీ కూడా ప్రారంభమైంది. బ్రిటన్‌లో అయితే 90 ఏళ్ల వృద్ధురాలికి తొలి ఫైజర్ టీకాను ఇచ్చారు. ఇదిలా ఉంటే అలర్జీ ఉన్నవారు ఫైజర్ వ్యాక్సిన్‌ను వేసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది.