అమెరికాలో ఇటీవల చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపగా అధికారులు దాన్ని కూల్చి వేశారు. ఈ క్రమంలో తాజాగా కెనడా గగన తలంలో అనుమానాస్పదంగా మరో వస్తువు కనిపించింది. దీంతో అమెరికా, కెనడాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టి దాన్ని కూల్చి వేశాయి.
ఈ మేరకు విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. గగన తలంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించగానే కూల్చి వేయాలని ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. యూఎస్‌కు చెందిన ఎఫ్- 22 ఫైటర్ జెట్ విమానం దీన్ని కూల్చి వేసిందన్నారు.
ఆ వస్తువుకు సంబంధించి శకలాలను స్వాధీనం చేసుకుని దాన్ని విశ్లేషించే పనిలో అధికారులు ఉన్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడి జో బైడెన్ తో తాను మాట్లాడినట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఇదే విషయంపై తాను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ తో మాట్లాడానని కెనడా రక్షణ మంత్రి వెల్లడించారు.
చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన తర్వాత అమెరికా, కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు కనిపించింది. ఇది కూడా డ్రాగన్ కంట్రీ పనేనా అనే సందేహాలు వస్తున్నాయి. అలస్కా సరిహద్దుల్లోని యూకాన్ ప్రాంతంలో ఈ గుర్తు తెలియని వస్తువును కూల్చి వేశారు.