ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సులేమాన్ ను హతమార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్ధించారు. ”ఉగ్ర పాలన అంతమైంది” అన్నారు. ” అమెరికా సైన్యం నిన్న చేసిన పని చాలా రోజుల క్రితమే చేయాల్సి ఉండే…చాలా ప్రాణాలు దక్కేవి” అన్నారు. ఖాసీం సులేమాన్ ఢిల్లీ, లండన్ నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలకు కుట్రలు పన్నేవాడని తెలిపారు. జనరల్ సులేమాన్ ఇరాన్ లోని అల్ ఖుద్ దళాల అధిపతి. ప్రాంతీయ భద్రతా యంత్రాంగానికి రూపశిల్ప అయిన సులేమాన్ ఇరాక్ లోని బాగ్దాద్ లో అమెరికా సైన్యం హతమార్చింది. సులేమాన్ తో పాటు ఇరాక్ శక్తివంతమైన పారా మిలిటరీ ఫోర్స్ అల్ షాబి డిప్యూటీ చీఫ్ కూడా హతమయ్యాడు.
అమెరికన్లు, అమెరికన్ సైనికులే లక్ష్యంగా ఇరాక్ లో తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల అమెరికన్ సైనికుడిపై దారుణంగా దాడి చేశారు. బాగ్దాద్ లోని అమెరికా ఎంబసీని ధ్వంసం చేశారు. ఇవన్నీ సులేమాన్ సూచనల మేరకే జరిగినట్టు ట్రంప్ వెల్లడించారు. సులేమాన్ తన ఉగ్రవాద కార్యకలాపాతో గత 20 ఏళ్లుగా మధ్య ప్రాచ్యంలో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఈ మధ్య ఇరాన్ లో సులేమాన్ నేతృత్వంలోని దళాలు 1000 మంది నిరసనకారులు దారుణంగా హతమార్చాయి. సులేమాన్ హత్యతో ఇరాన్ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంపై ట్రంప్ స్పందిస్తూ సులేమాన్ హత్య యుద్ధానికి దారి తీయదన్నారు.