వచ్చే వారం భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శక్రవారం మరో వ్యాఖ్య చేశారు. తనకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటేరా స్టేడియం వరకు 22 కిలో మీటర్ల దూరం రోడ్డు పొడవునా ఒక కోటి మందితో స్వాగతం పలకనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టు తెలిపారు. ట్రంప్ చెప్పిన లెక్క కంటే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చెప్పిన లెక్క చాలా తక్కువగా ఉంది. దాదాపు లక్ష మంది రానున్నట్టు మున్సిపల్ కార్పోరేషన్ ఇంతకు ముందు ప్రకటించింది. అహ్మదాబాద్ జనాభా 70 నుంచి 80 లక్షల వరకు ఉంటుంది.
”అహ్మదాబాద్ లో కోటి మందితో స్వాగతం పలుకుతున్నట్టు విన్నాను..ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం…అతిపెద్ద క్రికెట్ స్టేడియం వరకు వెళ్లే దారిలో ఎలాగైనా 60 నుంచి 70 లక్షల మంది ప్రజలు రానున్నట్టు చెప్పారు..ఇండియాలో కోటి మంది అంటే నేను సంతృప్తి చెందను..ఇంకా ఎక్కువ మంది రావాలి” అని ట్రంప్ కొలరాడోలోని కొలరాడో స్పింగ్స్ లో జరిగిన రీ ఎలక్షన్స్ ప్రచారంలో మాట్లాడుతూ చెప్పారు.
”వచ్చే వారం భారత్ వెళ్తున్నాను..వాళ్ల జనాభా 150 కోట్లు..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫేస్ బుక్ లో నెంబర్ టూ, ఆలోచించండి..నెంబర్ వన్ ఎవరో మీకు తెలుసు కదా..? అన్నారు.
ఈ నెల 24న ట్రంప్, మోదీ అహ్మదాబాద్ నుంచి మొటేరా వరకు 22 కిలో మీటర్లు కలిసి ప్రయాణించనున్నారు. దారి పొడవునా ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ మూడు గంటల పర్యటనకు దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్లను వెడల్పు చేస్తున్నారు. ఆ మార్గాన్నంతా సుందరీకరిస్తున్నారు.