అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించాక స్వలింగ సంపర్కులపై ఏనాడు అనుకూలంగా వ్యవహరించలేదు.పైగా వారి పట్ల ఆయన చూపిన వివక్ష, వివక్షా పూరిత వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. అయితే శుక్రవారం స్వలింగ సంపర్కుల గురించి ట్రంప్ స్పందన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఈ వార్త ఇప్పుడు మీడియాలో వైరలవుతోంది.
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారకుడు, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్ టాట్చెల్ బాలీవుడ్ మూవీపై పెట్టిన పోస్ట్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘గ్రేట్’ అని ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘శుభ్ మంగల్ జ్యాదా సావ్ ధాన్’ సినిమా శుక్రవారం రిలీజైంది. ఇద్దరు మగ స్వలింగ సంపర్కుల రోమాన్స్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఒక స్వలింగ సంపర్కుడు తన బోయ్ ఫ్రెండ్ కోసం తన ఛాందసవాద తల్లిదండ్రులతో పోరాడే విధానాన్ని బాగా చూపించారు. కామెడీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్ టాట్చెల్ ఈ సినిమాపై స్పందిస్తూ..” స్వలింగ సంపర్కులపై పెద్దల వివక్ష, ఛాందసవాదంపై ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ‘గ్రేట్’ అని రాశారు. స్వలింగ సంపర్కుల మీద ట్రంప్ ఎప్పుడూ స్పందించరు. అయితే ఇది పబ్లిక్ రిలేషన్స్ కోసం స్టంట్ అని కొందరంటుండగా…స్వలింగ సంపర్కుల పట్ల ఆయనలో మార్పుకు ఇది మొదటి దశ అంటున్నారు మరికొందరు.