కరోనా వ్యాక్సిన్‌పై అపోహలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ముందుకొచ్చారు. టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా లైవ్‌లో టీకా వేయించుకున్నారు. యూఎస్ రెగ్యులేటర్ ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిని ఇవ్వగా.. ఆ దేశంలో ఇప్పటికే చాలా మందికి టీకా వేశారు. అయితే చాలా మంది టీకా వేయించుకోవడానికి ధైర్యం చేయడం లేదు. దీంతో ఆ భయాన్ని పొగొట్టేందుకు తాజాగా జో బైడెన్ .. ఆయన స్వస్థలమైన డెలవేర్‌లో డోస్‌ను తీసుకున్నారు.
వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడాల్సిన పని లేదని జో బైడెన్ చెప్పారు. వ్యాక్సిన్ డోస్ వేశాక.. నిపుణుల సూచనలను పాటిస్తే చాలని సూచించారు. కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ ఆరంభం మాత్రమేనని పూర్తిగా బయట పడేందుకు మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉందని తెలిపారు జోబైడెన్. ఇటీవలే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజల్లో వ్యాక్సిన్‌పై మరింత విశ్వాసం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.