- జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేబడుతున్న ఇండియాకు వచ్చే ఏడాది అన్నివిధాలుగా సహకరిస్తామని అమెరికా ప్రకటించింది. గురువారం నుంచి లాంఛనంగా భారత్ ఈ హోదాను చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో భారత-అమెరికా మధ్య సంబంధాల గురించి ప్రస్తావించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరైన్ జీన్ పియెర్రీ.. తమ దేశాధ్యక్షుడు జోబైడెన్ 2023 లో ఇండియాను విజిట్ చేయనున్నారని, గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలపై ఆ సందర్భంగా భారత ప్రధాని మోడీతో చర్చించనున్నారని తెలిపారు.
- ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆహార, ఇంధన రంగాల్లో సమస్యలనెదుర్కొంటున్నాయని, వీటిపై ఉభయ దేశాల నేతలు సంప్రదింపులు జరుపుతారన్నారు. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జీ-20 సమ్మిట్ సందర్భంగా బైడెన్, మోడీ వివిధ అంశాల గురించి క్లుప్తంగా తమ అభిప్రాయాలు తెలియజేసుకున్నారని ఆమె గుర్తు చేశారు.
- బాలీ డిక్లరేషన్ కు సంబంధించి సభ్య దేశాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు మోడీ చేసిన కృషిని బైడెన్ ప్రశంసించారన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ అంతానికి ఈ డిక్లరేషన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఇది యుద్దశకం కాదని మోడీ స్పష్టంగా పేర్కొన్నారని పియెర్రీ అన్నారు.
- జీ-20 సమ్మిట్ ముగింపు సమావేశంలో బైడెన్, మోడీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో.. ప్రస్తావించిన అంశాలను ఆమె గుర్తు చేశారు. జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేబడుతున్న ఇండియా వచ్చే ఏడాది 200 సమావేశాలను నిర్వహించనుంది. ఈ హోదాలో ఇండియా.. ఆతిథ్య దేశాలుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలను పరిగణించి.. వీటిని ఈ జాబితాలో చేర్చింది.