ఇటీవలి అనుమానిత ‘గూఢచర్య’ బెలూన్ ఉదంతం నేపథ్యంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు మీ నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. . మంగళవారం ఉభయ సభల్లో ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేస్తూ ఆయన.. చైనాతో తాము పోటీనే కోరుకుంటాం గానీ ఘర్షణను కాదన్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. తన స్పీచ్ లో ఆయన జిన్ పింగ్ పేరును చాలాసార్లు ప్రస్తావించారు.
మా సార్వభౌమాధికారత్వానికి ముప్పు తెచ్చే ప్రయత్నం చేశారో.. సహించబోం అన్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ, క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు అధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా తాము కోట్లాది డాలర్లను వెచ్చించి సెమి కండక్టర్లు వంటివాటిని తయారు చేసుకుంటున్నామని, తమ దేశాన్ని బలోపేత దేశంగా మలచుకుంటున్నామని ఆయన చెప్పారు.
మా మిలిటరీని అధునాతనపరచుకుంటున్నామంటే మా సుస్థిరతను కాపాడుకుంటూనే ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని గ్రాహించాలన్నారు. చైనా కు అమెరికా నుంచి వస్తున్న పెట్టుబడులను ఆ దేశం ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సుమారు గంటకు పైగా బైడెన్.. చైనా దుందుడుకు వైఖరిని ఎండగట్టేట్టుగా ప్రసంగించారు. ఒక దశలో నేరుగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పైనే ఆయన తన విమర్శలను ఎక్కుపెట్టారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి పరోక్షంగా చైనా వత్తాసునిస్తున్నదన్నారు.
కమలా హారిస్ భర్తకు బైడెన్ భార్య జిల్ లిప్ కిస్
మంగళవారం క్యాపిటల్ హిల్ లో బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేయబోయే ముందు ఆయన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్
..ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎం హాఫ్ కి లిప్ కిస్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. నిజంగా ఆమె ఆయనకు లిప్ కిస్ పెట్టిందా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. సాధారణంగా అమెరికాలో ఒకరినొకరు హగ్ చేసుకోవడమో లేక లైట్ గా బుగ్గల మీద ముద్దు పెట్టుకోవడమో సహజం.. కానీ ఇది మరీ విడ్డూరంగా ఉందని చాలామంది ఆశ్చర్యపోయారు.