ఈ ఏడాది దీపాల వెల్లువతో వైట్ హౌస్ కళకళలాడనుంది. దీపావళి పండుగను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శ్వేతసౌధంలో సంబరంగా జరుపుకోనున్నారట. గత సంవత్సరం మాదిరే ఈ సారి కూడా ఆయన ఈ ఫెస్టివల్ ని ఆడంబరంగా జరుపుకోవడానికి ప్లాన్ చేశారు.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరెన్ జీన్ పియెర్రీ సంభ్రమంగా ఈ న్యూస్ చెప్పారు. అయితే సన్నాహాల గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. డేట్ ఎప్పుడన్నది ఇదమిత్థంగా తెలియదు. కానీ ఈ ఈవెంట్ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇండియాతో భాగస్వామ్యమంటే మా అధ్యక్షునికి ఎంతో మక్కువ. అలాగే ఇక్కడి ఇండియన్ అమెరికన్లను ఆయన అభిమానంగా ఆదరిస్తారు. ఈ కారణం వల్లే దీపావళిని సంబరంగా జరుపుకోవాలనుకుంటున్నారు అని పియెర్రీ చెప్పారు.
దీనితో బాటు ఇండియాకు సంబంధించి మరో తీపి కబురు కూడా ఉంది. ఈ అక్టోబరు నెలను ‘హిందూ హెరిటేజ్ మంత్’ గా మేరీలాండ్ గవర్నర్ లారెన్స్ హొగన్ ప్రకటించారు. అంటే హిందూ పండుగలకు ఈ నెలలో ఎంతో ప్రాధాన్యమివ్వనున్నారు.
చీకటి నుంచి వెలుగులోకి తెచ్చే దీపావళి మనకు ఎప్పుడూ గుర్తుండిపోవాలని బైడెన్ గత ఏడాది ట్వీట్ చేశారు. నిరాశ నుంచి ఆశకు, నిర్వేదం నుంచి సంతోషానికి బాటలు పరిచే ఈ పండుగ విశిష్టతే ఇది అన్నారు.
ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ గత సంవత్సరం దీపావళి నాడు వైట్ హౌస్ ని దీపాలతో అలంకరించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా .. ఇండియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదీ ఆమె ఇలాగే గ్రీటింగ్స్ చెప్పడానికి ఉవ్విళ్ళూరుతున్నారని సమాచారం.