బెలూన్ల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ .. దీనిపై చైనా అధినేత జీ జిన్ పింగ్ తో మాట్లాడుతానని ప్రకటించారు. ఈ సమస్యపై దౌత్యపరంగా ఆ దేశంతో సంప్రదింపులు కొనసాగిస్తామని, వదిలేది లేదని ఆయన చెప్పారు. ఈ నెల 4 న చైనాకు చెందినదని భావిస్తున్న అనుమానిత నిఘా బెలూన్ ను అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా విమానాలు పేల్చివేసిన తరువాత కూడా రెండు గుర్తు తెలియని బెలూన్లవంటివాటిని సౌత్ కెరొలినా గగనతలంలో. . మరొక దానిని కెనడాలో పేల్చివేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అయితే చైనాతో కొత్త అంతర్యుద్దాన్ని కోరుకోవడం లేదని బైడెన్ చెప్పారు.
ఈ ఉదంతాలపై ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో సమగ్రంగా చర్చిస్తానని, ఆయన వైఖరి తెలుసుకుంటానని అన్నారు. మొదట జరిగిన ఘటనకు తాము క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. మీరు అతిగా వ్యవహరిస్తున్నారంటూ బీజింగ్ తమను దాదాపు హెచ్చరించే స్థాయిలో స్పందించిందని, అందువల్లే ఆ దేశాధ్యక్షుడితోనే ఈ విషయాన్ని తేల్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.
నార్త్ అమెరికాలో ఈ నెల 13 న యుఎస్ మిలిటరీ ఫైటర్ జెట్లు ఓ సరస్సుపై ఎగురుతున్న విచిత్ర వస్తువును పేల్చివేశాయి. అయితే మూడు గుర్తు తెలియని వస్తువుల శకలాలను విశ్లేషిస్తే.. అవి చైనీస్ స్పై ప్రోగ్రాంకి సంబందించినవి కావని తేలినట్టు బైడెన్ తెలిపారు. బహుశా అవి ప్రయివేట్ కంపెనీలకు చెందినవని భావిస్తున్నామన్నారు. మరో దేశం నుంచి ఈ గగనతలంలో ప్రవేశించిన నిఘా వస్తువులా అన్నది కూడా తెలియాల్సి ఉంది అని పేర్కొన్నారు. దీనిపై కెనడా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోందన్నారు.
గుర్తు తెలియని వస్తువులను ట్రాక్ చేసి.. మానిటరింగ్ అనంతరం వాటిని పేల్చివేసేందుకు తమ ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందిస్తున్నట్టు జొబైడెన్ వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే జాప్యం జరిగిందన్నారు.