చైనాకు చెందిన బెలూన్ శకలాలను తిరిగి ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయిన ఈ బెలూన్ శకలాల్లో కొన్నింటిని తమ సిబ్బంది సేకరించారని.. కానీ వీటిని తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటించారు. ఇంకా మరికొన్ని శకలాల కోసం అన్వేషణ సాగుతోందన్నారు. రెండు రోజుల క్రితం ఈ బెలూన్ ని అమెరికా సైనిక విమానాలు గూఢచార బెలూన్ గా భావించి కూల్చివేశాయి.
సముద్రంలో పడిపోయిన ఇందులో ఇంకా ఏమేం ఉన్నాయో తెలుసుకునేపనిలో ఉన్నామని కిర్బీ చెప్పారు. అయితే ఈ సంఘటన జరిగినప్పటికీ చైనాతో తమ దేశ సంబంధాలకు ఇది అవరోధం కాబోదని అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు. దీన్ని చిన్నపాటి ఘటనగా ఆయన అభివర్ణించారు.
ఇక ఈ బెలూన్ ఉదంతానికి చైనా.. కోస్టారికాకు క్షమాపణ చెప్పింది. కేవలం వాతావరణ అధ్యయనం కోసం తాము దీన్ని ప్రయోగించామని, ఇది తన దిశ మార్చుకుని అమెరికా గగనతల పరిధిలోకి ప్రవేశించిందని బీజింగ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కొలంబియాలో నిన్న ఎగిరిన ఇదే తరహా బెలూన్ గురించి తమకు తెలియదని ఈ వర్గాలు వివరించాయి.
శాన్ జోస్ లోని చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు వివరణనిచ్చింది. కానీ ముందు జాగ్రత్త చర్యగా అమెరికా కోస్ట్ గార్డ్.. సౌత్ కెరొలినా సముద్ర జలాల్లో ప్రత్యేకంగా ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేసింది. ఇది తాత్కాలికమేనని వైట్ హౌస్ చెబుతున్నప్పటికీ మరికొంతకాలం దీన్ని ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని పేర్కొంది. చైనా చర్యల పట్ల తాము అప్రమత్తంగా ఉంటామని పరోక్షంగా తెలిపింది.