అగ్రరాజ్యం అమెరికాలో చైనా స్పై బెలూన్ కలకలం రేపింది. ఆకాశంలో చైనా స్పై బెలూన్‌ను గుర్తించినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. తమ దేశంపై డ్రాగన్ కంట్రీ గూఢచర్యానికి యత్నించిందని అధికారులు ఆరోపించారు. ఈ మేరకు అమెరికా అధికారులు చైనా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు.
గత రెండు రోజులుగా చైనీస్ గూఢచారి బెలూన్ ఒకటి అనుమానస్పదంగా యునైటెడ్ స్టేట్స్ ఆకాశంలో ఎగురుతూ ఉండటాన్ని తాము గుర్తించినట్టుగా పెంటగాన్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పలు ఆధారాలను కూడా తాము సేకరించినట్టు పేర్కొన్నారు.
ఈ బెలూన్ భారీ పరిమాణంలో ఉందన్నారు. సుమారు మూడు బస్సుల పరిమాణానికి సమానంగా ఉంటుందని చెప్పారు. బెలూన్‌ను కాల్చివేయాలని సైనికాధికారులు భావించారని యూఎస్ సీనియర్ రక్షణాధికారి ఒకరు తెలిపారు. కానీ అలా చేస్తే భూమిపై ఉన్న చాలా మందికి ప్రమాదం కలిగే అవకాశం ఉండతంతో వెనకడుగు వేసినట్టు వివరించారు.
ఈ బెలూన్ నిఘా కోసం పంపించిందని, అమెరికాలోని అతి సున్నితమైన ప్రదేశాలపై నుంచి బెలూన్ సంచిరిస్తోందని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బెలూన్ ఉత్తర మోంటానాలో ఆకాశంలో ఎగురుతోంది. మరోవైపు వాణిజ్య వాయు ట్రాఫిక్ కన్నా అత్యంత ఎత్తులో చైనా బెలూన్ ప్రయాణిస్తోందని అందువల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని పెంటగాన్ ఓ ప్రకటకనలో వెల్లడించింది.