అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడో ఒకచోట మారణహోమం జరుగుతుంటుంది. గత నెల రోజుల్లోనే నాలుగైదు ఘటనలు వెలుగుచూశాయి. రోజురోజుకీ అక్కడ గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. దీనిని అధిగమించేందుకు యూఎస్ లో అడుగులు పడుతున్నాయి. ఎలాగైనా గన్ కల్చర్ ను నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమెరికాలో గన్ కల్చర్ ను అరికట్టే ద్వైపాక్షిక బిల్లు ఒకటి ఉంది. దానికి తాజాగా అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఆయుధాల చట్టాల సంస్కరణపై అమెరికా స్పందించడం 30 ఏళ్లల్లో ఇదే తొలిసారి. ఇక హౌస్ లో బిల్లు పాసయితే చట్టరూపం దాల్చడమే. ఈ బిల్లు ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితమైంది. కానీ.. ఇటీవల న్యూయార్క్, టెక్సాస్ లలో జరిగిన రక్తపాతాలు అక్కడి రాజకీయ పార్టీల్లో చలనం కలిగించాయి. దీంతో ఈ బిల్లు అనూహ్యంగా యూఎస్ కాంగ్రెస్ ముందుకొచ్చింది.
65-33 ఓట్ల తేడాతో సెనేట్ లో ఆ బిల్లు గట్టెక్కింది. 15మంది రిపబ్లికన్లు.. అధికార డెమొక్రాట్లకు మద్దతు పలకడం విశేషం. గన్ కల్చర్ ను అరికట్టేందుకు రెండు పార్టీలకు చెందిన సెనేటర్లు కలిసి ముందుకు రావడంతో ఇది కార్యరూపం దాల్చుతోంది. ఈ బిల్లు కార్యరూపం దాల్చితే గన్ కొనుగోళ్లపై ఆంక్షలు ఉంటాయి.
అమెరికాలో 390 మిలియన్స్ కు పైగా గన్స్ ప్రజల దగ్గర ఉన్నాయి. ఒక్క 2020లోనే 45వేల మంది దాకా అమెరికన్లు ఆయుధాలకు సంబంధించిన ఘటనల్లో చనిపోయారు.